Kondapalli Srinivas : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7.69 లక్షల స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం రూ|. 30,635 కోట్ల వార్షిక రుణ ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas). దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం వెలుగు 2.0 ద్వారా ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో రెండు రోజుల సమీక్ష, ప్రణాళిక ముగింపు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
Minister Kondapalli Srinivas Key Comments
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ ప్రత్యేకంగా మహిళ ఆధ్వర్యంలో సంస్థల ఏర్పాటు కోసం దృష్టి పెట్టిందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 2.5 లక్షల మంది మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణ సౌకర్యాలు కల్పించి వస్తు తయారీ, సేవా రంగాలలో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆలోచన మేరకు వెలుగు 2.0 ద్వారా సమర్థవంతంగా ముందుకు సాగేందుకు సరైన ఆలోచనతో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పీడీలు, డిపిఎంలు, ఏపిఎంలు పనిచేసే జిల్లాల్లో వ్యవసాయ కార్యకలాపాలు విశ్లేషించి రైతులకు అధిక ఆదాయం ఇవ్వగల ప్రణాళికలకు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు.
ఈ ఏడాదిలో 350 రైతు ఉత్పత్తి గ్రూపులకు రూ 98.1 కోట్లు మంజూరయ్యాయని , ఆ నిధులను పారదర్శకంగా సమర్థవంతంగా వినియోగించి స్పష్టమైన ఫలితాలు సాధించాలని సూచించారు. నిధుల వినియోగంపై సామాజిక ఆడిట్ నిర్వహించేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఈవో ను ఆదేశించారు. నెక్ ద్వారా యాభై వేల విలువచేసే ఎగ్ కార్ట్ లను గుంటూరు జిల్లాలో లబ్డిదారులకు అందించారు. ఈ సంవత్సరంలో వెయ్యి ఎగ్ కార్ట్ లను ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ (Kondapalli Srinivas) చెప్పారు.
క్షేత్ర స్థాయిలో మహిళా మార్టులను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించి సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్న చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లాల పీడీలు శ్రీదేవి, శోభన్ బాబు, నరసయ్యలకు, అత్యుత్తమ ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసిన అనకాపల్లి , పార్వతీపురం మన్యం జిల్లాల పీడీలు సచీదేవి, సుధారాణిలను మెమొంటోలతో మంత్రి సత్కరించారు. ఈ సమావేశంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో వాకాటి కరుణ, అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలదారు టి విజయకుమార్, సెర్ప్ డైరెక్టర్లు, వివిధ జిల్లాల పీడీలు డీపీఎంలు ఏపీఎంలు పాల్గొన్నారు.
Also Read : DY CM Pawan Kalyan Interesting Comments : సనాతన ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదు
