హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2027లో ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు మంత్రులు శ్రీహరి, పొంగులేటి, అడ్లూరి. ఇక పుష్కరాలలో పనులు చేపట్టేందుకు గాను తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు ఓకే చెప్పిందన్నారు. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాలని నిర్ణయించిందని చెప్పారు.
రాష్ట్రంలోని DCMSలను మార్క్ ఫెడ్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.. TGRICని (తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) హాకాలో విలినం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపిందన్నారు.తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని ప్రకటించారు.
















