సాగునీటి ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వండి

కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రితో సీఎం చంద్ర‌బాబు భేటీ

hellotelugu-APCM

ఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల‌కు త‌క్ష‌ణ‌మే నిధులు ఇవ్వాల‌ని కేంద్ర జ‌ల్ శ‌క్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం సీఎం, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ప‌య్యావుల కేశ‌వ్ తో పాటు కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, రామ్మోహ‌న్ నాయుడుతో క‌లిసి కేంద్ర మంత్రికి విన‌తిప‌త్రాలు అందించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని అన్నారు. పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉందన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి విన్న‌వించారు నారా చంద్ర‌బాబు నాయుడు. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరారు.

Exit mobile version