అనంతపురం జిల్లా : శింగనమల నియోజవర్గంలో రహదారుల నిర్మాణంతో పాటు పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన కోసం ఎంపీ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణను. ఈ సందర్బంగా కీలక అంశాల గురించి విస్తృతంగా చర్చించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు .. ఈ సందర్భంగా జాతీయ రహదారి NH-544D పై కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా శిoగనమల క్రాస్ వద్ద వాహనాల అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది స్థానిక ప్రజలు, రైతులు, వ్యాపారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అత్యంత అవసరమని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు బండారు శ్రావణి శ్రీ. . అలాగే ఈ విషయంపై NHAI అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.
అదే విధంగా శిoగనమల నియోజకవర్గంలోని అరటి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పోస్ట్–హార్వెస్ట్ మౌలిక వసతులు, అరటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. ఈ చర్యల ద్వారా రైతులకు న్యాయమైన ధరలు లభించడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయాలు పరిగణలోకి తీసుకున్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించారు. సంబంధిత కేంద్ర శాఖలు, NHAI అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
