అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు. వైసీపీ పాలనా కాలంలో బీసీలకు చుక్కలు చూపించారని ఆవేదన చెందారు. గత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ప్రశ్నించిన పాపానికి బీసీలపై 26 వేలకు పైగా అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. దాడులు, హత్యలు చేశారని, బీసీల జీవనాధారాలను సైతం వదలకుండా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ. 75,760 కోట్లకు పైగా నిధులను దారి మళ్లించారన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి బీసీలను 16 వేలకు పైగా పదవులకు దూరం చేశారన్నారు. ఆదరణ పథకాన్ని నిలిపేసి బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేశారన్నారు.
సీఎం చంద్రబాబు రాకతోనే బీసీలకు పూర్వ వైభవం వచ్చిందని మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిటీని నియమించామని వెల్లడించారు. చట్ట సభల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని తెలిపారు. టీడీపీలోనే కార్యకర్తకు గౌరవం దక్కుతోందన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చూసుకుంటున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా గతంలో ఎన్నడూ అమలు చేయాలని పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
