వికారాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు దాదాపు రూ. 9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 7న శనివారం ముఖ్యమంత్రి ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట చేరుకుంటారు. అక్కడ నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. రైతు మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.అక్కడే ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి కొడంగల్ చేరుకుంటారు.
8వ తేదీన ఆదివారం రోజు ఉదయం హకీంపేటకు చేరుకుంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ లో రూ. 81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. రూ. 4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, రూ. 2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. బొంరాస్‌పేటలో రూ. 4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను, రూ. 3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని , కొడంగల్‌లో రూ. 3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.దుద్యాలలో రూ. 3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని, రూ. 12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.
కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ. 5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారిని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వద్ద, జాతీయ రహదారి 167N వరకు నిర్మించనున్నారు. కోస్గిలో రూ. 6 కోట్లతో నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని , దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ. 2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. దౌల్తాబాద్‌లో రూ. 4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా మొత్తం రూ. 9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్వాల్ గూడ నుంచి నాచారం వరకు రూ. 5,060 కోట్లతో రేడియల్ రోడ్డు -2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ. 1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ. 2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ పనులు ఉన్నాయి.విద్యా రంగంలో రూ. 118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ. 123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉన్నాయి . రూ. 41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్లు, రూ. 20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ. 20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ. 59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తిమ్మారెడ్డి పల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ. 4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు.
ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. రూ. 46.08 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ భవనాలను ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దుద్యాల సమీకృత మండల కార్యాలయ భవనం, కోస్గి సైన్స్ మ్యూజియం, హకీంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీటిలో ఉన్నాయి. దుద్యాల, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్లు, బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొడంగల్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
















