హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షి నటరాజన్‌ను తప్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో తెలంగాణ నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్‌ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఇవాళ ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు జరిగిన ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన మీనాక్షి నటరాజన్ సేవలను పార్టీ అభినందిస్తోందని అందులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తాజా మార్పుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీనిపై చర్చలు జరిగినప్పుడు.. ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారని పార్టీ వర్గాలు ఇన్ని రోజులు కవరింగ్ ఇస్తూ వచ్చాయి. కానీ తాజాగా ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ కవరింగ్ అంతా ఉత్తిదేనని తేలిపోయింది. తన వ్యూహాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి చక్రం తిప్పి, అధిష్ఠానాన్ని ఒప్పించి మరీ ఇన్ఛార్జ్ మార్పును సాధించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకంతో తెలంగాణ కాంగ్రెస్‌పై రేవంత్ రెడ్డి పట్టు మరింత స్పష్టమైందని చెప్పవచ్చు.
