హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాహుల్ గాంధీ పద్ధతి, మాటలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఇంత చిల్లర వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారా ? అనిపిస్తుందన్నారు. త్యాగాల పునాదుల మీద భారతదేశం నిర్మాణం జరిగిందన్నారు. భారత దేశ ఆత్మగౌరవం దెబ్బతీసేలా విదేశీగడ్డపై ఎన్నికల వ్యవస్థను, సుప్రీం కోర్టును అపహాస్యం చేసేలా రాహుల్ గాంధీ మాట్లాడుతుండడం దారుణమన్నారు ఈటల రాజేందర్. మంచు గడ్డల్లో ప్రాణాలకు తెగించిన సైనికులను కించపరుస్తూ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నపుడు మిలట్రీ వ్యాన్లు కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. సొంత క్యాబినెట్ మంత్రులను జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఎద్దేవా చేశారు.
బాంబు పేలుళ్ల ఘటనలు జరిగింది కాంగ్రెస్ హయంలోనే కాదా అని నిలదీశారు ఈటల రాజేందర్. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. మోదీ పాలనలో ఒక్క రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించారా ? అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఈ దేశంలో పెద్ద రాష్ట్రాలలో కాంగ్రెస్ కనుమరుగైందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ల ప్రభుత్వమని ప్రజలు చెబుతున్నారన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి తెలుసుకోవాలని సూచించారు ఎంపీ. ప్రజల కళ్లలో మట్టికొట్టిండు రేవంత్ రెడ్డి. తెలంగాణాలో 15 శాతం కమీషన్ ఇవ్వకపోతే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు అసాధ్యమని ఆనాడే చెప్పానన్నారు.
కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, రైతులకు రైతు భరోసా లేదన్నారు.
