హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు . ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. ప్రజలు రేవంత్ రెడ్డిని తిడుతుంటే తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంటూ చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో మోసపోయిన ప్రజలు నానా అగచాట్లకు గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల వలన అన్యాయానికి గురవుతున్న వర్గాలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే తనకు సంతోషం కలుగుతుందంటూ రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగగా ఉందన్నారు కేటీఆర్.
ప్రజల పక్షాన ప్రభుత్వానికి సమస్యలు తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి తనకు పైశాచిక ఆనందం వస్తుందని ప్రతిపక్షాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా సీఎంకు సిగ్గు అనిపించడం లేదన్నారు. కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేక పోతున్నందుకు, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేక పోతున్నందుకు సిగ్గు అనిపిస్తుందా లేదా? అని కేటీఆర్ నిలదీశారు. ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ కూడా అనిపిస్తుందా లేదా? అని మండిపడ్డారు. ఇంత నిస్సిగ్గుగా పైశాచిక ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలో ప్రజలే నిర్ణయించు కోవాలన్నారు. ప్రతిసారి “నేను మారిన మనిషిని” అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి యథావిధిగా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వసూలు చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు.
