ఆదిలాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. ఎల్ నినో పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను, రైతులను నిట్ట నిలువునా ముంచాడని ఆరోపించారు. రైతులకు ఇచ్చేందుకు ఖజానాలో నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, ఢిల్లీకి మాత్రం నిరంతరం డబ్బు కట్టలు పంపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. రుణమాఫీలు, రైతు బంధు పెంపు, ప్రతి తులం బంగారానికి హామీ వంటివన్నీ గాలిలో కలిసి పోయాయంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ పోరాడుతున్నట్లు నటిస్తూనే ఢిల్లీలో మాత్రం చేతులు కలిపి ‘ఇక్కడ కొట్టి, అక్కడ తిప్పే’ రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లోని సీసీఐని కాంగ్రెస్ నిర్వీర్యం చేసి, పరిశ్రమలను గుజరాత్‌కు తరలిస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం నోరు మెదపడం లేదు ఎందుకని మండిపడ్డారు కేటీఆర్. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని అన్నారు. దీనిని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టిన పాపాన పోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ చేతకాని సర్కార్ కు త్వరలోనే మంగళం పాడక తప్పదన్నారు. ఏ రైతు కూడా అధైర్య పడకండి అని కోరారు. . కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రైతుల రాజ్యం తప్పక వస్తుందని జోష్యం చెప్పారు. అప్పుడు ప్రతి రైతును మనస్ఫూర్తిగా ఆదరించి, వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు.
















