Repo Rate : దేశంలో వినియోగదారుల ధరల పెరుగుదల (రిటైల్ ద్రవ్యోల్బణం) జూన్‌లో గణనీయంగా తగ్గింది. వరుసగా ఎనిమిదో నెలలో కూడా తగ్గుదల నమోదు కావడంతో, ఇది గత ఆరేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరుకుంది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (Repo Rate) 2.1 శాతంగా నమోదైంది. ఇది 2019 జనవరిలో నమోదైన 1.97 శాతం తర్వాత కనిష్ఠంగా ఉన్న స్థాయి.
Repo Rate Updates
జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఈ తగ్గుదల ముఖ్యంగా ఆహార ధరల తగ్గుదల కారణంగా చోటు చేసుకుంది. జూన్‌లో కూరగాయల ధరలు -19 శాతం క్షీణత నమోదు చేయగా, పప్పులు మరియు వాటి ఉత్పత్తులు -11.76 శాతం, మాంసం మరియు చేపలు -1.62 శాతం, పాల ఉత్పత్తులు, చక్కెర మరియు ఇతర తినుబండారాలు -3.03 శాతం వరకూ తగ్గినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఆర్‌బీఐ లక్ష్యానికి చేరువ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన ద్రవ్యోల్బణ పరిధి 2 శాతం నుంచి 6 శాతం మధ్యగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం నమోదైన 2.1 శాతం ద్రవ్యోల్బణం ఈ పరిధికి అత్యంత చేరువలో ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి నుంచి రెపో రేటును మొత్తం 1 శాతం మేర తగ్గించిన రిజర్వ్ బ్యాంక్, ఆగస్టులో జరిగే ద్రవ్య విధాన సమీక్షలో మరో 0.25 శాతం తగ్గించే అవకాశం ఉందని ఐక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు.
తెలంగాణలో అత్యల్ప ద్రవ్యోల్బణం
ప్రాంతాల వారీగా చూస్తే, జూన్‌లో తెలంగాణ రాష్ట్రం అత్యల్ప రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది. ఇది కేవలం 0.93 శాతంగా ఉండగా, కేరళలో అత్యధికంగా 6.71 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 1.72 శాతం, పట్టణాల్లో 2.56 శాతంగా ఉంది.
టోకు ధరల సూచీ కూడా తగ్గుదల
టోకు ధరల సూచీ (WPI) కూడా జూన్‌లో తగ్గుదల నమోదు చేసింది. ఇది 0.13 శాతంగా నమోదవగా, గత నెల మేలో ఇది 0.39 శాతంగా ఉండింది. గత ఏడాది జూన్‌లో ఇది 3.43 శాతంగా ఉండటం గమనార్హం. టోకు స్థాయిలో ఆహార వస్తువుల విభాగం మాత్రం 3.75 శాతం పాజిటివ్ ద్రవ్యోల్బణాన్ని చూపింది.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో సామాన్య ప్రజలకు ఉపశమనం లభించనుండగా, రుణ వడ్డీ రేట్లపై మేలైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ఆహార ధరలపై ఇది ఎన్ని రోజులు ప్రభావం చూపుతుందో చూడాలి.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు



















