చెన్నై : తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలనంగా మారాడు. సినిమా ఆలస్యం అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం పట్ల చిత్ర బృందం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇలాంటి వార్తలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్బంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించింది. రజనీకాంత్ ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పింది. 2023లో భారీ విజయం సాధించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2 మూవీని అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపింది. నెలల తరబడి నిరీక్షణ, అనేక ఊహాగానాల తర్వాత రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘సన్ పిక్చర్స్’ సంస్థ ఎక్స్ వేదికగా విడుదల తేదీని ఖరారు చేసింది. తద్వారా ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలవుతుందన్న గతంలోని ఊహాగానాలకు తెరదించింది. ఈ అప్‌డేట్‌ను పంచుకుంటూ అక్టోబర్ 15న అల్లరి రేపబోతున్నాం అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
దసరా పండుగ సమయంలో ఈ సినిమా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద పండుగ సీజన్ ప్రయోజనం లభించనుంది. రీషూట్ల కారణంగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలలో జాప్యం జరగవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ మరోసారి ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’ పాత్రలో కనిపించనున్నారు, నెల్సన్ మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 2023లో విడుదలైన మొదటి భాగం ‘జైలర్’, రజనీకాంత్ కెరీర్‌లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా సాధించిన విజయం సీక్వెల్ పై భారీ అంచనాలను పెంచింది, దీంతో ఇది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ చిత్రాలలో ఒకటిగా మారింది.
చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్‌మెంట్ టీజర్ తో పాటు ‘అలా బొలెలో’ పాట వంటి ప్రచార కార్యక్రమాలతో ‘జైలర్ 2’పై ఆసక్తిని పెంచడం ప్రారంభించింది. ఈ సీక్వెల్‌లో నటీనటుల జాబితా కూడా విస్తరించింది. విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనుండగా, ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణన్, యోగి బాబు, విద్యా బాలన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
















