హైదరాబాద్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. ఇవాళ డాక్టర్ కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కేవలం 5% జనాభా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం 12 సార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆరోపించారు. బీసీలు 50% ఉండగా, పేద, బలహీన వర్గాలు కలిపి మొత్తం జనాభాలో 90% వరకు ఉన్నారని మరి వారికి ఎందుకు పదవులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన సీట్లు, పదవులు కేటాయించాల్సి ఉందన్నారు. కానీ గత కొన్నేళ్లుగా, తర తరాలుగా అగ్రవర్ణాలకు, సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బీసీ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఈ వర్గాల నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కరు కూడా బీసీ సామాజిక వర్గానికి సీఎం పదవి దక్కలేదని సంచలన ఆరోపణలు చేశారు డాక్టర్ కేఏ పాల్.
ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ సైతం రెడ్లకు అందలం ఎక్కించారని, బీసీలకు తీరని అన్యాయం చేశారంటూ ఆరోపించారు. జగ్గారెడ్డి లేదా కోమటిరెడ్డి సోదరులు దూషించినా సరే, వారి పదవులకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కానీ కొండా సురేఖ ఒక బీసీ మహిళ కదా? ఆమె కుమార్తె ఏదో అన్నారన్న కారణంతో ఆమెను పదవి నుండి తొలగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ చీఫ్. రాష్ట్ర జనాభాలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఎందుకని కొండా సురేఖను తొలగించాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు . దీనికి పూర్తిగా తనే బాధ్యత వహంచాలని అన్నారు.కాపులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రాజకీయ పార్టీల నుండి వచ్చే ‘ప్యాకేజీల’ కోసం తమను తాము అమ్ముకుంటారని పేర్కొన్నారు.
