హైదరాబాద్ : భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికను జారీ చేసింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ ప్రాంతంలో బలపడుతుండటంతో, రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను పూర్తిగా ఆవరించాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ , బీహార్‌లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫుల్‌బాని, రాంచీ, జముయి, ముజఫర్‌పూర్ మీదుగా కొనసాగుతోందని వెల్లడించింది.
రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ , ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కూడా ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదని అధికారులు తెలిపారు. అయితే, వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

















