తిరుమల : వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అత్యంత సమర్థవంతంగా దర్శన ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.శుక్రవారం ఆయన శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి టైమ్ మేనేజ్మెంట్, క్యూలైన్ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించడంతో దర్శనాల సంఖ్యలో గణనీయమైన వృద్ధి సాధ్యమైందన్నారు. ప్రతిరోజూ సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 15 వేల మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ ఐదు వేల మంది సర్వదర్శన భక్తులకు దర్శనం కల్పించడం ద్వారా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.
సాధారణంగా గురువారం నాడు శ్రీవారికి నిర్వహించే వారపు కైంకర్యాల కారణంగా దర్శన సమయం తక్కువగా ఉన్నా కూడా తొలిసారి రికార్డు స్థాయిలో 79 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించడం టీటీడీ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ప్రతి గంటకు క్యూలైన్ల పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తూ, అవసరమైన నిర్ణయాలను తక్షణమే అమలు చేయడం వల్ల దర్శన ప్రక్రియ మరింత వేగవంతమైందన్నారు. వేసవి రద్దీ నిర్వహణలో టీటీడీ విభాగాలతో పాటు విజిలెన్స్, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయడం విశేష ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు, వైద్య సేవలు, క్యూలైన్లలో సౌకర్యాలు నిరంతరాయంగా అందించేలా అన్ని విభాగాలు అప్రమత్తంగా పని చేస్తున్నాయని చెప్పారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం కల్పించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అధికార యంత్రాంగం అంకితభావంతో సేవలందిస్తోందని అదనపు ఈవో తెలిపారు.
