బెంగళూరు : రజిత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ ఐపీఎల్ 2026 మెగా టోర్నీ 19వ సీజన్ లో బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి పోరులో సత్తా చాటింది. ఈ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. స్థానికుల మద్దతుతో మరోసారి రెచ్చి పోయి ఆడారు ఆర్సీబీ ఆటగాళ్లు. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ స్కిప్పర్ ఊహించని విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ చేయమని కోరాడు. తన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ షాన్ దార్ షో చేశాడు. తనతో క్లాసెన్ కూడా రాణించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదన కోసం మైదానంలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండానే హాయిగా ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ప్రధానంగా ఓపెనర్లు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ 61 రన్స్ చేసి చివరి దాకా ఉన్నాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. పడిక్కల్ సైతం సూపర్ షో చేశాడు. దీంతో ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే 203 స్కోర్ చేసింది 4 వికెట్లు కోల్పోయి. దీంతో 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది తనకు ఎదురే లేదని చాటింది.
