RBI : మరణించిన ఖాతాదారుల డిపాజిట్ ఖాతాలు, లాకర్లు, సేఫ్ కస్టడీలోని వస్తువులపై నామినీలు లేదా చట్టపరమైన వారసుల క్లెయిమ్‌లను త్వరగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఆర్బీఐ తాజాగా ఒక సర్క్యులర్‌ను జారీ చేసి, ప్రజల నుంచి ఆగస్టు 27, 2025లోపు అభిప్రాయాలను ఆహ్వానించింది.
RBI – ప్రామాణిక ఫారమ్‌లు, సులభతరం అయిన క్లెయిమ్ ప్రక్రియ
ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు నామినీలు లేదా చట్టబద్ధ వారసుల నుంచి క్లెయిమ్ దాఖలు చేసేందుకు ప్రామాణిక ఫారమ్‌లను ఉపయోగించాలి. ఈ ఫారమ్‌లు ప్రతి శాఖలోను, బ్యాంకుల అధికారిక వెబ్సైట్లలోను అందుబాటులో ఉంచాలి. వాటిలో అవసరమైన పత్రాల జాబితా, క్లెయిమ్ పరిష్కారానికి దశలవారీ విధానం వివరంగా ఉండేలా చూడాలని ఆర్బీఐ (RBI) సూచించింది.
అవసరమైన పత్రాలు
- నామినీ ఉన్నట్లయితే: క్లెయిమ్ ఫారమ్, మరణ ధృవీకరణ పత్రం, నామినీ గుర్తింపు రుజువు, చిరునామా ఆధారం.
- నామినీ లేని ఖాతాలయితే: చట్టపరమైన వారసుల కోసం సరళీకృత విధానం అనుసరించాలని సూచించింది.
- రూ.15 లక్షల లోపు క్లెయిమ్‌లకు: ఇండెమ్నిటీ బాండ్, నో-అబ్జెక్షన్ లెటర్లు సరిపోతాయి.
- తర్వాతి స్థాయిలో: వారసత్వ ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి.
స్పష్టమైన కాలప్రమాణం
- అవసరమైన పత్రాలన్నీ అందిన తర్వాత 15 క్యాలెండర్ రోజులలోపు క్లెయిమ్ పరిష్కారం పూర్తవ్వాలి.
- లాకర్ లేదా సురక్షిత వస్తువుల విషయమై కూడా 15 రోజుల్లో వాటి జాబితా తీసుకునేందుకు తేదీని ఖరారు చేయాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తుంది.
ఆలస్యం అయితే జరిమానా
- డిపాజిట్ క్లెయిమ్‌లకు ఆలస్యం అయితే: బ్యాంకు తప్పు కారణంగా ఆలస్యం జరిగితే, ప్రస్తుత బ్యాంక్ వడ్డీ రేటుకు అదనంగా సంవత్సరానికి 4% వడ్డీ ఇవ్వాలి.
- లాకర్లు, సేఫ్ కస్టడీ వస్తువుల క్లెయిమ్ ఆలస్యం అయితే: ప్రతి ఆలస్య రోజుకు రూ.5,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలి.
లక్ష్యం: నమ్మకాన్ని పెంచడం
ఈ ప్రతిపాదనల ద్వారా మరణించిన ఖాతాదారుల కుటుంబ సభ్యులు ఆస్తులపై క్లెయిమ్ చేయడం మరింత సులభమవుతుందని, ప్రజలలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఆర్బీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.
Also Read : Today Gold Price : చాలాకాలానికి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు


















