శ్రీ సత్యసాయి జిల్లా : రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలూ కృషి చేస్తున్నారని మంత్ర సవిత కొనియాడారు. కియా లాంటి అంతర్జాతీయ కార్ల పరిశ్రమను తీసుకొచ్చారని అన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమతో పాటు ఏరో స్పెస్ పరిశ్రమను నెలకొల్పుతున్నారని చెప్పారు. హార్టీకల్చర్ హబ్ గా, సోలార్ హబ్ గా, పారిశ్రామిక హబ్ గా రాయలసీమను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు సవిత. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతమొందించి, ఇక్కడి బిడ్డలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత కూడా సీఎం చంద్రబాబు నాయుడిదేనన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధి ప్రదాత అయితే, జగన్ ద్రోహిగా నిలబడ్డారన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రూ.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంలో లోకేశ్ కీలకంగా వ్యవహరించారన్నారు. గాడి తప్పన విద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి, ఏపీ విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దుతున్నారన్నారు. దేశంలోనే ఏపీని అగ్ర పథాన నిలుపుతున్న మంత్రి నారా లోకేశ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని మంత్రి సవిత తేల్చి చెప్పారు. రాజకీయ ఉనికి కోసం జగన్ మరోసారి శవ రాజకీయాలకు తెర లేపారని, ఆయనను ఎవరూ పట్టించు కోవడం లేదని సవిత తెలిపారు.
