చెన్నై : తమిళ సూపర్ స్టార్, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే తలైవా రజనీకాంత్ తన సినీ ప్రస్థానం తో పాటు జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి , ఇన్నేళ్ల తన ప్రయాణంతో ఆత్మ కథ రానుందా. ఇదే విషయం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తమిళ సినీ పరిశ్రమలో. రజనీకాంత్ ఆత్మకథ తమిళం, ఆంగ్లం రెండింటి లోనూ విడుదల కానుందా? అవుననే అంటున్నారు ప్రముఖ రచయిత వైరముత్తు. ఏడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న తమిళ గీత రచయిత ఆయన. ప్రస్తుతం తాను పని చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆత్మకథ తమిళం , ఆంగ్లం రెండింటిలోనూ విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రజనీకాంత్‌తో ఇటీవల జరిగిన సమావేశం వివరాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. రాబోయే చిత్రం ‘జైలర్ 2’ విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు తాను రజనీకాంత్‌ను కలిశానని తెలిపారు వైరముత్తు.
సమావేశంలో తాము కళ , జీవితం గురించి చర్చించామని, రాజకీయాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత రజనీకాంత్ ఆత్మకథకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆయన వెల్లడించారు. నేను ఆయనను ‘మీ ఆత్మకథ ఎప్పుడు వస్తుంది?’ అని అడిగాను. దానికి ఆయన ‘పని జరుగుతోంది. త్వరలోనే వస్తుంది’ అని సమాధానమిచ్చారని పేర్కొన్నారు వైరముత్తు. రజనీకాంత్ ఆత్మ కథ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తాను ఆయనతో చెప్పినట్లు వైరముత్తు పేర్కొన్నారు. ఎందుకని ఆయన నన్ను అడిగారు, దానికి నేను చాలా మందికి చరిత్ర ఉంటుంది, కానీ మీకు ఆకర్షణ శక్తి కూడా ఉందన్నానని తెలిపారు. మరోవైపు రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందించిన ఈ ఆసక్తికరమైన యాక్షన్ ఎంటర్టైనర్కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇప్పటికే ‘U/A’ సర్టిఫికేట్‌తో విడుదలకు అనుమతినిచ్చింది.


















