విజయవాడ : సంప్రదాయ సంస్కృతికి ఆధునిక హంగులు అద్దుతూ, నగర ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని నింపిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ విజయవాడలో వైభవంగా ముగిసింది. వైబ్ ఈవెంట్స్, లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ వేగా జ్యువెలర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ నగరం దసరా శరన్నవరాత్రుల వేళ భక్తి, సంస్కృతి, కళావైభవంతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన దాండియా ఉత్సవం గుజరాతీ సంప్రదాయ నృత్యమైన దాండియా, గర్బాతోపాటు ఆధునిక సంగీతం, వినోద కార్యక్రమాల సమ్మేళనంగా ఆకట్టుకుంది. యువత, మహిళలు, కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ తన బృందంతో అందించిన అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. డీజేల సంగీతం, పంజాబీ ధోల్ వాయిద్యాల నాదం, దాండియా ఆటలతో ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ మారుమోగింది. సంప్రదాయ నృత్యాలకు ఆధునిక సంగీతాన్ని జోడించి నిర్వహించిన కార్యక్రమాలు వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి .రోజువారీ వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి కొంతసేపు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఈ ఉత్సవం మంచి వేదికగా నిలిచిందని పలువురు నగరవాసులు అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రజలకు గుజరాతీ సంస్కృతిని పరిచయం చేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వేగా జ్యువెలర్స్ నిర్వాహకులను అభినందించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏడాది ఈ వేడుకను నిర్వహించాలని కోరారు.
వేడుకకు హాజరైన అతిథులకు నిర్వాహకులు సంప్రదాయ హారతి, తిలకంతో ఘనస్వాగతం పలికారు. స్థానిక రుచులను అందించే ఫుడ్ స్టాళ్లు, మాక్టెయిల్ కౌంటర్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఫేస్ పెయింటింగ్, రంగురంగుల గాజుల దుకాణాలు, మాగ్నెటిక్ ఫొటో బూత్లు, ప్రత్యేక సెల్ఫీ పాయింట్లు పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. సంప్రదాయాలను ప్రతిబింబించే పలు పోటీలు కూడా ఉత్సవంలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ నవరాత్రులు భక్తి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే పండుగ అని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల కళాభిరుచిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను పరిరక్షించడంతోపాటు నగర ప్రజలతో తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విజయవాడ ప్రజల నుంచి లభించిన స్పందన ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. సంప్రదాయ కళారూపాలను ఆధునిక హంగులతో మేళవించి, విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ నగరవాసులకు మరపురాని అనుభూతిని అందించింది. సంప్రదాయాల పరిరక్షణతోపాటు సామాజిక అనుబంధాలను బలోపేతం చేసే సాంస్కృతిక వేడుకగా ఈ కార్యక్రమం ప్రత్యేక గుర్తింపు పొందింది.


















