హైదరాబాద్ : ప్రముఖ విలక్షణ మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ . ఈ చిత్రం నుండి సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘రాధే రాధే’ అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. హృదయాలను హత్తు కునేలా మనోడు పాటను అందించడం విశేషం. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ ఇప్పటికే కీలక ప్రకటన చేవారు. ఆకాశంలో ఒక తార మూవీని నవంబర్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని. దీంతో ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ హత్తుకునేలా ఉంది. ఇక త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలను పెంచుతోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది.
ఈ పాట కథానాయకుడి జీవితం గురించి ముఖ్యంగా అతను బొగ్గు గనుల్లో పని చేయడానికి గుజరాత్‌కు ఎలా వెళ్లాడనే అంశంపై ఒక చిన్న పరిచయాన్ని అందిస్తుంది. ‘బిజిలి’ పాత్రలో నటిస్తున్న రుహాని శర్మతో కథానాయకుడు సంభాషించే సన్నివేశంలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడవుతుంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మధురమైన మెలోడీ కథానాయకుడి మానసిక స్థితిని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాటను జి.వి. ప్రకాష్ కుమార్ , లిప్సిక భాష్యం కలిసి పాడారు. శ్రీమణి రాసిన సాహిత్యం పాత్ర పడుతున్న సంఘర్షణను మాటలు లేకుండానే కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. దుల్కర్ సల్మాన్ ఈ పాత్రలో ఎంతో సహజంగా, పరిణతితో నటించారు; ఆయన తన నటన ద్వారా పాత్రలోని వేదనను, అణచి పెట్టుకున్న భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో రుహాని శర్మ కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా , లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో సాత్విక వీరవల్లి మరో ప్రధాన పాత్రలో నటించగా, శృతి హాసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది.
