హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఎన్బీకే -112 సినిమాకు సంబంధించి వస్తున్న అనధికారిక వార్తలను నమ్మవద్దని చిత్ర బృందం స్పష్టం చేసింది. ముఖ్యంగా సంగీత దర్శకుడి విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై ముందు నుంచే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి. ముందుగా ఈ చిత్రానికి ప్రముఖ తమిళ కంపోజర్ అనిరుధ్ సంగీతం అందిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత, బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన తప్పుకున్నారని, ఆయన స్థానంలో యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఎంపిక చేశారని మరో ప్రచారం మొదలైంది.
ఈ వార్తలతో బాలకృష్ణ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ టీం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించింది. సంగీత దర్శకుడి విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఇప్పటి వరకు ఎవరినీ అధికారికంగా ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అధికారికంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రకటనతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెర పడినట్లయింది. మరో వైపు గతంలో కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర భారీ సక్సెస్ సాధించింది. ఇందులో కీ రోల్ పోషించింది జాహ్నవి కపూర్. ఆ తర్వాత చాలా గ్యాప్ అనంతరం నందమూరి బాలకృష్ణతో కొరటాల శివ మూవీ రానుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
