హైదరాబాద్ : గండిపేట ప్రాంగణానికి రాగానే పాత స్మృతులు, అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కాలినడకన తిరుగుతూ ఎన్టీఆర్ స్కూల్ ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ సంస్థకు చెందిన విద్యార్థులు గాడ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం చంద్రబాబు దంపతులు ఆసక్తిగా తిలకించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గండిపేటకు వస్తే పాత విషయాలు గుర్తుకు వస్తాయన్నారు. గండిపేట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉండేదని అన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా నిలిచిందన్నారు.
ఇప్పుడు విద్యార్థులకు శిక్షణ ఇస్తోందని చెప్పారు. గండిపేటలో భావితరాల కోసం నాయకత్వాన్ని తయారు చేశామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న తరగతుల్లోనే నాడు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించామని తెలిపారు. చిన్న మొక్కగా ప్రారంభించిన విద్యా సంస్థలను పెద్ద వృక్షంగా మార్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు, విద్యా సంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారంటూ ప్రశంసించార. ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు గ్రూప్-1 పరీక్షల్లో నలుగురు పాస్ అయ్యారని, ముగ్గురు జూనియర్ సివిల్ జడ్డీలుగా ఎంపికయ్యారని తెలిపారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన వారికి దేశంలోని వివిధ ప్రముఖ విద్యా సంస్థల్లో 29 మందికి సీట్లు వచ్చాయి. 131 మంది విద్యార్థులతో విద్యా సంస్థను ప్రారంభించాం… ఇప్పుడు 1641 మంది చదువుతున్నారు. సంస్థ ఈ స్థాయికి ఎదగడానికి నారా భువనేశ్వరినే కారణం అని ముఖ్యమంత్రి అన్నారు.
