ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌బ్లిక్ స్కూళ్లు : సీఎం

ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో స‌క‌ల వ‌స‌తులు

hellotelugu-AkunuriMurali

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని సీఎం ఆదేశించారు. విద్యా శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిస‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌మైన విద్య‌కు చిరునామాగా తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌హాలో నిర్మించాల‌ని సీఎం ఇంజినీర్ల‌ను ఆదేశించారు.

వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాల‌ని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండాల‌ని సీఎం తెలిపారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శాల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Exit mobile version