అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. పొద్దస్తమానం ఏఐ జపం చేయడం తప్పితే రాష్ట్రంలో పాలన గురించి పట్టించు కోవడం లేదన్నారు. ఏఐ మీద పెట్టే శ్రద్ధలో పావు వంతైనా ముఖ్యమంత్రి ప్రజారోగ్యం మీద పెట్టాలని హితవు పలికారు. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను బలోపేతం చేయక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ముగ్గురు పిల్లలను కనాలని చెబుతున్న సీఎం ఉన్న పిల్లల బాగోగుల గురించి మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. . రాజమండ్రి కల్తీ పాల ఘటనలో సంభవించిన 11 మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలేనని సంచలన ఆరోపణలు చేశారు షర్మిలా రెడ్డి. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్ధానాలు కల్తీ. మొత్తం పాలనే కల్తీఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా వరలక్ష్మి డెయిరీ నడుస్తుంటే చర్యలేవి ? తనిఖీలు ఎక్కడ ? ఈ ఘటన యాదృచ్ఛికం కాదని అన్నారు షర్మిలా రెడ్డి. పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. ప్రజలు చేసిన తప్పు కేవలం పాలు కొనుక్కోవడమేనా? అని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరే ఉన్నారట. ఆమె కూడా ఇక్కడ ఉండరట. పాలల్లో యూరియా, డిటర్జెంట్లు కలుపుతున్నారట. కనీసం పాల విషయంలో భద్రత ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? ఉడితే ఎంత ? అని మండిపడ్డారు. నాలుగు రోజులు తనిఖీలు అంటూ హడావిడి చేశారు. మళ్లీ యధా రాజా తథా ప్రజా. సైతాన్ సైన్యానికి ఆపద వస్తే తప్పా జగన్ మోహన్ రెడ్డి సైతం బయటకు రారంటూ మండిపడ్డారు.
















