అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు చురకలు అంటించారు. కొందరు ఫైళ్లను చూడడం లేదన్నారు. ఇక పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నాం అని వెల్లడించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అన్నారు. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోందని చెప్పారు.. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్ విధానంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటం ద్వారా ప్రజలకు ఉపయోగ పడుతుందన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్టే… ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలన్నారు. . ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయిచాం. సమస్యలు పరిష్కారమైతే బ్రాండ్ రావటంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరగటం ముఖ్యం అన్నారు.
కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు… పిటిషన్లకు పరిష్కారం చూపాలి అని అన్నారు సీఎం. ప్రతీ నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్నారు. సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్ గా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. అన్ని వీడియో కాన్ఫరెన్సులను కూడా ఒకరోజుకు పరిమితం చేద్దామన్నారు . ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలి. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైమ్ వృధా అవుతుందో ఆలోచించాలన్నారు సీఎం. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్ లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే సమయం వృధా కాదన్నారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే… పాలన సులభతరం అవుతుందన్నారు. వాట్సప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా పౌరసేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం అని తెలిపారు. ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం… 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సప్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. డిసెంబరు నాటికి అన్ని సేవల్ని వాట్సప్ లో అందించేలా చూడాలన్నారు.
