ప‌బ్ వివాదం వికాస్ మర్మత్ కు బ‌దిలీ బ‌హుమానం

బెంగ‌ళూరు ప‌బ్ లో పోలీసుల‌పై ఐఏఎస్ దాడి

hellotelugu-VikasMarmat

అమ‌రావ‌తి : బెంగళూరు పబ్‌లో పోలీసులతో ఏపీకి చెందిన ఐఏఎస్ వికాస్ మ‌ర్మ‌త్ ఘర్షణ పడిన సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న‌పై కేసు నమోదు కావడంతో వికాస్ మర్మత్‌పై ఏపీ సర్కార్ తక్షణ చర్యలు తీసుకుంది. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ బాధ్యతల నుంచి తొలగించింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో కర్ణాటకలోని కబ్బన్ పార్క్ పీఎస్‌లో వికాస్ మర్మత్‌ సహా నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ వివాదంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా బెంగళూరులోని ఒక పబ్‌లో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ప్రభుత్వం తక్షణమే బదిలీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆయనతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు, 2019 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారిని తక్షణమే బదిలీ చేశారు. కుప్పం ఏరియా డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతలను తాత్కాలికంగా చూసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ , జిల్లా మేజిస్ట్రేట్‌ను ప్రధాన కార్యదర్శి కోరారు

ఈ ఘటన అక్టోబర్ 10న అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ఒక పబ్‌లో చోటుచేసుకుంది. బార్‌లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు బృందం, అక్కడ ఉన్న వ్యక్తులను వయస్సు ధృవీకరణ కోసం గుర్తింపు కార్డులు చూపించమని కోరింది. ఈ క్రమంలో మర్మత్ , ఆయనతో ఉన్నవారు పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసులను దూషించడం, వారిపై దాడి చేయడం లేదా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో మర్మత్ , ఇతరులపై కేసు నమోదైంది. మిగిలిన నిందితులను అభయ్ ఉదయ్ సింగ్, నితేష్ , రోషన్‌గా గుర్తించారు.

ఫిర్యాదు ప్రకారం, ఈ వ్యక్తులు అసభ్య పదజాలం ఉపయోగించడమే కాకుండా ఇన్‌స్పెక్టర్‌ను, ఆయన సహచరులను కొట్టి, బెదిరించారు. అంతే కాకుండా పోలీసులు తమ విధులను నిర్వహించకుండా అడ్డుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 115(2) (స్వచ్ఛందంగా గాయ పరచడం), 351(2) (నేరపూరిత భయ పెట్టడం), 352 (శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ పూర్వకంగా అవమానించడం), 132 (ప్రభుత్వ ఉద్యోగి తన విధులను నిర్వహించకుండా అడ్డుకోవడానికి దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగం చేయడం) , 3(5) (ఉమ్మడి ఉద్దేశం) కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

Exit mobile version