ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన శుక్రవారం కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్ తో పాటు తాజాగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈసందర్బంగా ఏపీకి సంబంధించిన సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రధానంగా దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. తక్షణమే రూ.590.91 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఏపీకి ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తక్షణమే నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు నిర్మలా సీతారామన్ తో కీలక చర్చలు జరిపారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో సాగునీటి ప్రాజక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించుకునేలా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి విజ్ఞాపన పత్రం అందించారు చంద్రబాబు నాయుడు. గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నారు.
