నాకు జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించండి

కేంద్ర హొం శాఖ‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే

hellotelugu-GaliJanardhanReddy

క‌ర్ణాట‌క : తాజాగా బ‌ళ్లారి ఘ‌ట‌న‌లో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో గంగావ‌తి ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, బ‌ల్లారి ఎమ్మెల్యే నారా భ‌ర‌త్ రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య వాల్మీకి బ్యాన‌ర్ పెట్టే విష‌యంలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్య‌క‌ర్త ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది కాంగ్రెస్ స‌ర్కార్. ఈ మేర‌కు బ‌ళ్లారి జిల్లా ఎస్పీని స‌స్పెండ్ చేసింది. విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని పేర్కొంది. అందుకే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపింది. ఇదిలా ఉండ‌గా హింసాత్మ‌క ఘ‌ట‌న కేసుకు సంబంధించి పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మొత్తం 11 మందిపై కేసు న‌మోదు చేశామ‌న్నారు. ఇందులో ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బి. శ్రీ‌రాములుపై కూడా కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు విజ‌యేంద్ర‌. హైకోర్టు న్యాయ‌మూర్తితో విచార‌ణ జరిపించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ప్రాణ భ‌యం ఉంద‌ని, కావాల‌ని సెక్యూరిటీ త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే త‌న‌కు జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. ఈ మేర‌కు ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖ రాసిన‌ట్లు చెప్పారు. కావాల‌ని త‌న‌ను చంపేందుకే కుట్ర‌కు తెర లేపారంటూ వాపోయారు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి.

Exit mobile version