అమరావతి : మురసు తుపాను తీరాన్ని దాటే ప్రక్రియ మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని, గుంటూరు వంటి ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడం తుపాను తీవ్రతను తెలియ జేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలు, కాలువ గట్లను గుర్తించి, వాటిని తక్షణం పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
చెరువులకు సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు డిప్యూటీ సీఎం. మురసు తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు. వర్షాలు తగ్గే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అర్నబ్ తుపాను సమయంలో అనుసరించిన విధంగానే – ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని తరలించి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర పనులకు వినియోగించాలని నిర్దేశించారు. గ్రామాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందని, పెద్ద ఎత్తున వర్షపు నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నివాస ప్రాంతాలకు సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా మళ్లింపు చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థకు అడ్డంకులు ఏర్పడకుండా చూడాలని స్పష్ట చేశారు పవన్ కళ్యాణ్. నీటిని తొలగించిన ప్రాంతాల్లో దుర్వాసన, దోమల వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని , తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా పైప్లైన్లు దెబ్బతింటే తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్, అవసరమైన చోట సూపర్ క్లోరినేషన్ చేపట్టి అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని దిశా నిర్దేశం చేశారు. వర్షపు నీటి ప్రవాహాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణం పునరుద్ధరించి, గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు.
