పార్కు స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా ఉక్కుపాదం

దూకుడు పెంచిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ప్ర‌భుత్వ భూముల‌ను ,పార్కు స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకున్న వారి ప‌ని ప‌డుతోంది. తాజాగా హైడ్రా ఆధ్వ‌ర్యంలో పార్కు స్థలాల్లోని ఆక్రమణలను తొలగించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని మంజీరా కాలనీలో పార్కు కోసం కేటాయించిన 577 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. గ్రామ పంచాయతీ లేఅవుట్‌లో పార్కుగా పేర్కొన్న ఈ స్థలాన్ని, కొందరు ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ఈ ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు అక్కడ కాంపౌండ్ గోడలను నిర్మించి, మరిన్ని నిర్మాణాలకు సిద్ధమవుతుండగా మంజీరా కాలనీ ప్రతినిధులు హైడ్రా హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్థానిక మున్సిపల్ అధికారులకు కూడా తాము ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆ స్థలం లేఅవుట్ ప్రకారం పార్కుకు చెందినదేనని హైడ్రా నిర్ధారించింది. దీనితో అక్కడ నిర్మించిన కాంపౌండ్ గోడలను తొలగించింది. ఆ స్థలం పార్కుకు చెందినదని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేసి, చుట్టూ ఫెన్సింగ్ (కంచె) వేసింది.

ఇదే క్ర‌మంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో పార్కు ,ప్రజా అవసరాల కోసం కేటాయించిన 639 గజాల స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది. ఈ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయించగా కొనుగోలుదారులు అక్కడ ప్రీకాస్ట్ గోడలను నిర్మించారు. దీనిపై స్థానికులు హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ లేఅవుట్‌లోని సర్వే నంబర్లు 33/3, 33/4 పరిధిలో మొత్తం 67 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ లేఅవుట్‌లో ఇప్పటికే రోడ్లు, నివాస గృహాలు ఉన్నాయి. కొన్ని ప్లాట్లకు LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) అనుమతులు కూడా లభించాయి. అయితే గ్రామ పంచాయతీ లే అవుట్ ప్రకారం 37, 38, 39 నంబర్లు గల ప్లాట్లు పార్కు , ప్రజా అవసరాల కోసం కేటాయించబడినట్లు నిర్ధారించారు. దీనితో రంగంలోకి దిగిన హైడ్రా అక్కడ ఉన్న కాంపౌండ్ గోడలను తొలగించారు. 639 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఇది పార్కు మరియు ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలమని పేర్కొంటూ బోర్డులను అమర్చారు.

అక్రమ బోరుబావులకు వ్యతిరేకంగా హైడ్రా చేపట్టిన చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లాపుర్‌లో కూడా హైడ్రా దాడులు నిర్వహించింది. 3 బోరు బావులను, 3 నీటి సంపులను తొలగించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపుర్ గ్రామంలో ఇప్పటికే 7 బోరు బావులు, 6 నీటి సంపులను తొలగించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేసిన హైడ్రా అదనంగా మరో 3 బోరు బావులను, 3 నీటి సంపులను తొలగించింది. అక్రమ బోరు బావులకు సంబంధించి అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని తొలగించే ప్రక్రియను హైడ్రా కొనసాగిస్తోంది.

Exit mobile version