రోజ్ గార్ మేళాలో 51 వేల మందికి ఆఫ‌ర్ లెట‌ర్స్

పంపిణీ చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

hellotelugu-PMModi

న్యూఢిల్లీ : కేంద్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిరుద్యోగ యువ‌త కోసం రోజ్ గార్ మేళాను ప్రారంభించింది. ప్ర‌స్తుతం శ‌నివారం చేప‌ట్టిన మేళా 19వ‌ది కావ‌డం విశేషం. ఈ మేళాలో దాదాపు 51 వేల మందికి పైగా నియామ‌క ప‌త్రాల‌ను పంపిణీ చేశారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల‌న్న‌ ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా, ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రోజ్‌గార్ మేళా ఒక ప్రధాన కార్యక్రమంగా ప్రారంభించారు. 19వ రోజ్‌గార్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఒక సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజ్ గార్ మేళా ముఖ్య ఉద్దేశం యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డం అన్నారు. ఈ మేళా ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 రోజ్‌గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక లేఖలు జారీ చేసిన‌ట్లు తెలిపారు. 19వ రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహించడం జ‌రిగింద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్తగా నియమితులైన అభ్యర్థులు, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్య విభాగం మొదలైన భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారని చెప్పారు.

Exit mobile version