బీహార్ : జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాక అధ్యక్షుడు, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల బీహార్ లో ఆయన పాదయాత్ర చేపట్టారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓడి పోయారు. ఈ సమయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ (ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ) రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుండి పోటీ చేయాలని ‘జన్ సురాజ్ పార్టీ’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు. ఆదివారం నాడు పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల ఆదరణకు ఈ ఉప ఎన్నిక ఒక ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) లాంటిదని ఆయన అభివర్ణించారు.
బంకీపూర్ ప్రజలు బీహార్‌లోనే అత్యంత సంపన్నులు, అత్యధిక విద్యావంతులు. వారు ఉత్తమ అభ్యర్థికి ఓటు వేయాలి. నాపై నమ్మకం ఉంచవచ్చని వారు భావిస్తే, నాకు ఓటు వేయాలని కోరుతున్నాను… నా పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, అసెంబ్లీలోని మిగిలిన 242 మంది ఎమ్మెల్యేల కంటే నా ప్రభావం ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ విజయం సాధించినప్పుడు జెడి(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, ప్రజల ప్రత్యక్ష తీర్పు లేకుండానే బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయ్యారని 48 ఏళ్ల కిషోర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

















