అమరావతి : నేను తెలుగు వాడిని, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడినని గర్వంగా చెప్పుకుంటున్నాను అని అన్నారు మంత్రి నారా లోకేష్. ఆ గర్వం మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములు . ఆయన ఒక వ్యక్తి కాదు తెలుగు గౌరవం. ఆయన ప్రాణత్యాగం.. మన రాష్ట్రం. ఆ మహనీయుడి జయంతి.. మన ఆంధ్రులకు పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని అన్నారు మంత్రి. యువ గళం పాదయాత్రలో నేను ఆర్యవైశ్య సోదరులను అనేకసార్లు కలిశాను. వాళ్లకి ఉన్న సమస్యల గురించి చర్చించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని పరిష్కరించాం, ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా పరిష్కరిస్తాం. అమరావతిలో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చాను.
ఇచ్చిన హామీని తక్కువ సమయంలోనే నిలబెట్టు కోవడం ఆనందంగా ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ 58 అడుగులు అమరజీవి ఆమరణ దీక్షచేసిన 58 రోజులకు సంకేతం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనకు ప్రతిరోజు గుర్తు చేస్తుంది. మనం ఒకరోజు ఉపవాసం ఉండాలి అంటే ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన 58 రోజులు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. ఈ చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత. 2025 సెప్టెంబర్ 3న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. 194 రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం, ట్రస్ట్, అధికారులు, సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు అందరినీ అభినందిస్తున్నాను. విగ్రహ ఏర్పాటు మాత్రం జెట్ స్పీడ్ లో చేశారు. ఇంత స్పీడ్ గా చేస్తారు అని నేను ఊహించ లేదన్నారు నారా లోకేష్.



















