చెన్నై : అత్యంత కీలకమైన జనాభా గణన కార్యక్రమం వచ్చే ఆగస్టు నెల 1వ తేదీ నుంచి తమిళనాడులో ప్రారంభం కానుంది. రాష్ట్రంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. కాగా తదుపరి దశాబ్దపు సర్వే 2021లో జరగాల్సి ఉంది. అయితే, COVID-19 మహమ్మారి కారణంగా, జనాభా గణన ప్రక్రియ వాయిదా పడింది. భారతదేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుంది జనాభా గణన ప్రక్రియ . తమిళనాడులో ‘స్వయం-గణనస పద్ధతితో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉందని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. జూలై 17, 2026న 15 రోజుల పాటు సాగే ఈ స్వయం-గణన ప్రక్రియ ప్రారంభమవుతుంది; దీని ద్వారా పౌరులు డిజిటల్ పద్ధతిలో తమ వివరాలను స్వయంగా నమోదు చేయడం ద్వారా జనాభా గణనలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.
ఈ ఏడాది ఆగస్టు 1 నుండి 30 వరకు రాష్ట్రంలో ‘గృహాల జాబితా , గృహ గణన’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రజా విభాగం కీలక ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా సన్నాహక ఏర్పాట్లలో భాగంగా, స్థానిక అధికారులకు శిక్షణ ఇచ్చే ‘మాస్టర్ ట్రైనర్ల’ కోసం తమిళనాడు అంతటా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లు తమిళనాడు జనాభా గణన కార్యకలాపాల డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. జనాభా గణన మొదటి దశ విజయవంతంగా , సజావుగా అమలు అయ్యేలా చూడటంలో ఈ కార్యక్రమం ఒక కీలక ముందడుగు అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. రెండు దశల్లో జరగనున్న ఈ జనాభా గణన ప్రక్రియలో కచ్చితత్వాన్ని పెంచడానికి, సమన్వయాన్ని మెరుగు పరచడానికి , సమర్థవంతంగా సమాచారాన్ని సేకరించడానికి ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.
