న్యూఢిల్లీ : విశాఖ ఓడరేవు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ కోరారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ను కలిశారు. ఇందుకు సంబంధించి వినతిపత్రం సమర్పించారు. విశాఖ నగరంలోని ఓడరేవు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ‘గ్రీన్ పోర్ట్’ (పర్యావరణ హిత ఓడరేవు) కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓడరేవు కార్యకలాపాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం భౌగోళిక స్వరూపం గాలిలోని కాలుష్య కారకాలు సులభంగా విస్తరించకుండా అడ్డుకుంటుందని, దీనివల్ల నగరం దుమ్ము , సూక్ష్మ ధూళి కణాల ప్రభావానికి ఎక్కువగా గురవుతోందని ఆయన పేర్కొన్నారు.
జూలై 10న విశాఖపట్నం కలెక్టరేట్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు . ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, అదానీ గంగవరం పోర్ట్ , ఇతర సంబంధిత వర్గాల అధికారులు సరుకు రవాణా , నిర్వహణ సమయంలో ఏర్పడే దుమ్ము కాలుష్యంపై సమీక్షించారు. యాంత్రిక పద్ధతిలో సరుకు నిర్వహణ, ఫాగ్ కెనాన్లు, స్ప్రింక్లర్ వ్యవస్థలు, హెచ్డీపీఈ కవర్లు, టైర్-వాషింగ్ సదుపాయాలు , గ్రీన్ బఫర్ జోన్ల వంటి చర్యలను పోర్ట్ నిర్వాహకులు ఇప్పటికే చేపట్టినప్పటికీ, కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని శ్రీభరత్ అన్నారు. ‘హరిత్ సాగర్ – గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలు, 2023’ అమలును వేగవంతం చేయాలని, దుమ్ము ఎక్కువగా వెలువడే సరుకుల నిర్వహణలో యాంత్రీకరణను పూర్తి చేయాలని, అలాగే అన్ని పోర్ట్ టెర్మినల్స్‌లో మూసివున్న కన్వేయర్ వ్యవస్థలు, శాస్త్రీయ పద్ధతిలో సరుకు నిల్వ, ఆటోమేటెడ్ దుమ్ము నియంత్రణ వ్యవస్థలు , గాలిని అడ్డుకునే కంచెలను తప్పనిసరి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

















