2027 మార్చి నాటికి పోల‌వ‌రం కాలువ‌ల ప‌నులు పూర్తి

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-PolavaramCanal

అమ‌రావ‌తి : పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌ధానంగా కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువల ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించేలా వాటి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న ఐకానిక్‌ బ్రిడ్జిని పూర్తి చేసి రాకపోకలతో పాటు పర్యాటక అభివృద్ధికి అవకాశాలు కల్పించాలని సూచించారు. గోదావరి–పెన్నా అనుసంధానంపై కార్యాచరణ ప్రారంభించాలని, గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తరలించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన, దిగువన వైకుంఠపురం, చోడవరం వద్ద ఆనకట్టల నిర్మాణం ద్వారా 14 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలన్నీ క్రియాశీలంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాలువల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు, భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు అంతర్గత జల రవాణాకు అవసరమైన నావిగేషన్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

జలధార–జలహారతి రెండో దశ పనులను మార్చి 31 వరకు కొనసాగిస్తూ, 150 రోజుల కార్యక్రమంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్‌ జీతో అనుసంధానం చేసి పనులు చేపట్టాలన్నారు. 2027 ఏప్రిల్‌ 1 నుంచి మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. భూగర్భ జలమట్టాలను మూడు మీటర్లకు పైగా పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టాలన్నారు. జలధార–జల హారతిని నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తూ వర్షపు నీటిని ఒడిసి పట్టాలని, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను పెంచాలని చెప్పారు. వర్షపాతం తక్కువగా ఉన్నా ప్రకృతి వ్యవసాయం ద్వారా స్థూల వ్యవసాయ ఉత్పత్తి తగ్గకుండా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే 36 ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కాలువలపై సౌర విద్యుత్‌ ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి అన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టి కాలువల నిర్వహణను మెరుగు పరచాలని, పూడిక తొలగించి చిట్ట చివరి ఎకరాకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. లాకులు, షట్టర్లు, గేట్ల నిర్వహణను పటిష్ఠం చేయాలని సూచించారు.

Exit mobile version