ఘట్ కేస్కర్ : పాఠాలు చెప్పాల్సిన టీచర్ విద్యార్థినిని మెస్మరైజ్ చేసి మ్యారేజ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజిగిరి కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీసులు 20 రోజుల కిందట సదరు టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆపై రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక్కడ పర్రే మైటీన్ అనే 27 ఏళ్ల టీచర్ పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆపై మాయ మాటలు చెప్పాడు. లోబర్చుకున్నాడు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని మెడలో పసుపు తాడు ఉండడం చూసి అవాక్కయ్యారు పేరెంట్స్. విషయం గురించి ఆరా తీశారు. తనకు ఏమీ తెలియదని, అంతా టీచరే చేశాడంటూ కన్నవారితో బాధితురాలు వాపోయినట్లు తెలిసింది.
టీచచర్ పర్రే మైటీన్ తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో పేరెంట్స్ పాఠశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించారు. తనకు ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. టీచర్ ను నిలదీయడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనడంతో ప్రిన్సిపాల్ సదరు టీచర్ ను పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. విద్యార్తిని తండ్రి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు పర్రే మైటీన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అయితే ఈ వేధంపుల పర్వం తమ పాఠశాలలో జరగలేదని పాఠశాల యాజమాన్యం చెప్పింది. ఇదిలా ఉండగా పాఠశాల మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి , ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
