PM Modi : దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) యువతకు ఉత్సాహభరితమైన వార్త తెలిపారు. లాల్‌కిల్లా వేదికగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, దేశ అభివృద్ధికి యువత కీలక శక్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ.లక్ష కోట్ల నిధులతో “ప్రధాన మంత్రి వికసిత్ భారత్ యోజన” పేరిట కొత్త పథకాన్ని ప్రకటించారు.
ఈ పథకం కింద ఉద్యోగంలో కొత్తగా చేరిన యువతకు ప్రోత్సాహకంగా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. యువత తమ సొంత ఆలోచనలతో, ఆవిష్కరణలతో ముందుకు వచ్చినపుడల్లా కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని మోదీ హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఇది కీలకమైన ముందడుగని పేర్కొన్నారు.
PM Modi – డబుల్ దీపావళీ – ప్రజలకు మరో శుభవార్త
దేశ ప్రజల కోసం త్వరలో “డబుల్ దీపావళీ” అందించనున్నట్టు మోదీ (PM Modi) తెలిపారు. సామాన్యులకు ఊరట కలిగించేందుకు జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నిత్యవసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల మద్దతుతో దేశాన్ని ముందుకు నడిపే బాధ్యత తమపై ఉందని మోదీ పేర్కొన్నారు.
ఇంధనంపై ఆత్మనిర్భరత – దేశ అభివృద్ధికి దోహదం
చమురు ఉత్పత్తుల దిగుమతులపై దేశం భారీగా ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ఉత్పత్తులపై లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. దీన్ని తగ్గించేందుకు సముద్ర మంథన్ ద్వారా దేశీయ చమురు నిల్వలను గుర్తించే పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇంధన రంగంలో కూడా ఆత్మనిర్భరత సాధించడం వల్ల ఆర్థికంగా దేశానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు.
ఎకో ఫ్రెండ్లీ ఎరువుల అవసరం – యువతకు పిలుపు
ఫర్టిలైజర్ల విషయంలో కూడా దేశం విదేశాలపై ఆధారపడుతోందని మోదీ తెలిపారు. వాణిజ్యపరంగా ఉపయోగపడే, భూమికి హానికరం కాని ఎరువుల తయారీ వైపు దేశీయ పరిశ్రమలు దృష్టి సారించాలని, యువత, పరిశ్రమలవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘భూమాతను కాపాడే విధంగా పారిశ్రామిక ఆవిష్కరణలు తీసుకురావాలి,’’ అని మోదీ సూచించారు.
మహిళా సంఘాల ఉత్పత్తులకు ప్రోత్సాహం – నాణ్యత, ధరపై దృష్టి
దేశంలోని మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలంటే నిబంధనల వల్ల ఆటంకం కలగకూడదని, అవసరమైతే ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకురావడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ‘‘ధర తక్కువగా ఉండాలి – నాణ్యత ఎక్కువగా ఉండాలి’’ అనే నినాదంతో తయారీ రంగం ముందుకెళ్తే, భారత్‌కు ప్రపంచంలో ప్రధాన స్థానముంటుందని స్పష్టం చేశారు.
Also Read : PM Narendra Modi Warning : పాకిస్తాన్ కు భారత ప్రధాని మోదీ మాస్ వార్నింగ్
