ప్లీజ్..మొక్క‌జొన్న రైతుల‌ను ఆదుకోండి : సీఎం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రికి చంద్ర‌బాబు లేఖ

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగు చేసిన మొక్క‌జొన్న‌ల‌ను కొనుగోలు చేయాల‌ని, అన్న‌దాతల‌ను ఆదుకోవాల‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయాలని విన్న‌వించారు. మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింప చేసి ఆదుకోవాలని కోరారు సీఎం. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నార‌ని వాపోయారు. మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆదుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1600 నుండి రూ.1700 మధ్య మాత్రమే ఉందని తెలిపారు కేంద్ర మంత్రికి.

కనీస మద్దతు ధర రూ.2400 కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉందని వెల్ల‌డించారు. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారని వాపోయారు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి మద్దతు లేక పోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుంద‌న్నారు. PM-AASHA కింద నేరుగా రైతులకు ధరల వ్యత్యాసాన్ని చెల్లించాల‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా పరిగణించి, ధరల వ్యత్యాసంలో 100% నిధులను కేంద్రమే భరించాలని కోరారు సీఎం. ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలన్నారు.

Exit mobile version