అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటే కొందరు కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా విశాఖ ఐటీ పార్కుల ఏర్పాటుపై వ్యతిరేకంగా కొందరు కోర్టులో పిల్స్ వేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నారా లోకేష్. ప్రపంచ దిగ్గజ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), కాగ్నిజెంట్, సత్వ గ్రూప్, రహేజా కార్ప్ విశాఖపట్నంలో చేపట్టిన ఐటీ పార్క్ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా పిల్స్ దాఖలయ్యాయని ఐటీ మంత్రి పేర్కొన్నారు . ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
పిటిషన్లు దాఖలు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల పనులు అర్దాంతరంగా ఆగి పోతాయని వాపోయారు. ప్రధానంగా యువతకు ఉపాధి అవకాశాలకు ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు నారా లోకేష్. ప్రధానంగా కంపెనీలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈ పిటిషన్లను దాఖలు చేసిందన్నారు. ఆయా కంపెనీల ఏర్పాటు వలల్ల లక్షకు పైగా ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు. పిల్స్ దాఖలు చేయడం వల్ల ఉపాధి లేకుండా పోతుందన్నారు నారా లోకేష్. యువత భవిష్యత్తుపై ఈ ద్వేషం ఎందుకు? ప్రతి అడుగులోనూ ఏపీని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు.
