అమరావతి : అత్యంత తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన తాగు నీటి ప్రాజెక్టుల పనులు వారాంతపు లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏడాది చివరినాటికి పూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెలవారీ, వారాల వారీగా విభజించుకుని, ఎప్పటికప్పుడు పూర్తికావాల్సిన పనులపై సమీక్షించు కోవాలని స్పష్టం చేశారు. తద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేసి, గడువులోపు ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల కింద రూ. 2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్‌లైన్ నిర్మాణం కోసం వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి గొంతు దాహార్తి తీరాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ సంకల్పాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. అత్యంత నీటి ఎద్దడి కలిగిన ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 2024తో ముగిసిన జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించడం జరిగిందన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దాదాపు రూ. 26,000 కోట్ల విలువ చేసే తాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. అందులో మొదటి విడతగా రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో చేపట్టిన ఐదు మెగా వాటర్ గ్రిడ్ పథకాల్లో చిత్తూరు కూడా ఒకటి అని పేర్కొన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించేందుకు జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో రూ. 2,370 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మక తాగునీటి సరఫరా పనులు చేపట్టడం జరిగిందన్నారు పవన్ కల్యాణ్. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో ఉన్న 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేలా చేస్తున్నామన్నారు. సుమారు 25 లక్షల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. చిత్తూరు మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి సంబంధించి గండికోట వద్ద నిర్మాణం చేపట్టిన ఒక ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

















