బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 250 ఏళ్ల అమెరికా స్వాతంత్ర వేడుకల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెండున్నర శతాబ్దాల అమెరికా ప్రస్థానం చరిత్రలో ఒక మైలురాయి మాత్రమే కాదు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ సామర్థ్యం వంటి శాశ్వత విలువలకు కూడా ఇది ఒక వేడుక అని ఆయన అభివర్ణించారు. భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్, అమెరికా కాన్సుల్ జనరల్ మరియానా ఎల్. నీసులర్ సమక్షంలో జరిగిన యుఎస్ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు బెంగళూరులో జరిగాయి. ఈ కార్యక్రమాని సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
భారతదేశం , యునైటెడ్ స్టేట్స్ లకు వేర్వేరు చరిత్రలు ఉండవచ్చు, కానీ మన ఆకాంక్షలు గాఢంగా ముడిపడి ఉన్నాయని అన్నారు సీఎం. నేడు, ఈ భాగస్వామ్యం ప్రభుత్వాలకు అతీతంగా విశ్వ విద్యాలయాలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, యువత ద్వారా విస్తరించిందని పేర్కొన్నారు. బెంగళూరులో 1,000కు పైగా అమెరికన్ కంపెనీలు, 80,000 మందికి పైగా అమెరికన్ పౌరులు ఉండటంతో ఈ సంబంధానికి కర్ణాటక కేంద్రంగా ఉన్నందుకు గర్వకారణంగా ఉందన్నారు డీకే శివకుమార్.
బెంగళూరు, సిలికాన్ వ్యాలీ మన రెండు దేశాల మధ్య ఒక అద్భుతమైన వారధిని నిర్మించాయని చెప్పారు. బెంగళూరు ఇకపై కేవలం ప్రపంచ ప్రతిభకు గమ్యస్థానం మాత్రమే కాదు. రేపటి సాంకేతికతలు ఊహించబడి, నిర్మించ బడుతున్న ప్రదేశంగా ఇది అంతకంతకూ మారుతోందని అన్నారు. క్విన్ సిటీ, మన సెమీకండక్టర్ పార్క్, ప్రతిపాదిత ఏఐ టెక్ పార్క్ , ఏఐ హబ్, భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఏఐ విశ్వ విద్యాలయంతో కర్ణాటక తదుపరి తరం ఆవిష్కరణలకు సిద్ధమవుతోందని అన్నారు. మన ‘బియాండ్ బెంగళూరు’ చొరవతో సహా అమెరికన్ వ్యాపార సంస్థలు, సంస్థలు, పరిశోధకులు , ఆవిష్కర్తలను కర్ణాటకకు రావాలని పిలుపునిచ్చారు.

















