అమరావతి : రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 44.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.7డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు.బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.
అలాగే శనివారం రోజున 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. రాబోవు రెండు రోజులు క్రింద విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లు ఎండీ వివరించారు . పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 – 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో రేపు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.
















