హైదరాబాద్ : యంగ్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండకు గుర్తింపు తీసుకు వచ్చిన సినిమాలలో పెళ్లి చూపులు చిత్రం ఒకటి. ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్బంగా కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ స్పందించాడు. తన జీవితంలో మరిచి పోలేని సినిమా అని పేర్కొన్నాడు. ఈ సినిమా 2016లో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ చిత్ర బృందంపై తనకున్న ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేశారు దేవరకొండ. ఒక సుదీర్ఘ సందేశంలో విజయ్ ఇలా రాశారు. మనం అందరం థియేటర్లలో కలుసుకుని 10 ఏళ్లు గడిచాయన్న విషయాన్ని చదువుతుంటే ఏదో వింతగా అనిపిస్తోంది అని పేర్కొన్నాడు. సినిమా పరంగా చూస్తే మనం నవ్వుకున్నాం, ప్రేమలో పడ్డాం, ఇప్పటికీ మనల్ని కలిపి ఉంచే ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాం. ఏదో తెలియని భావోద్వేగ భారం కలుగుతోంది అని తెలిపాడు .
ఆ రోజు నా యువ దశలో జరిగిన మరే ఇతర సంఘటన కంటే కూడా ఎంతో ముఖ్యమైనది. స్వేచ్ఛాభావం కలిగిన, తిరుగుబాటు స్వభావం ఉన్న ఒక యువకుడికి అది గుర్తింపును, ధైర్యాన్ని ఇచ్చింది. కలలు కనడంలో గానీ, నమ్మడంలో గానీ తాను మూర్ఖుడిని కాదని నిరూపించిందని అన్నాడు. తన తెలుగు ప్రేక్షకులపై ప్రేమను కురిపిస్తూనే సినిమా దర్శకుడు, రచయిత తరుణ్ భాస్కర్ పట్ల తనకున్న అభిమానాన్ని విజయ్ దేవరకొండ పంచుకున్నారు. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నాను. కానీ అన్నింటికంటే ముఖ్యంగా తరుణ్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను మిత్రమా… నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది, నీతో కలిసి ఈ సినిమా చేయడం నా అదృష్టం; నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తివి అని ప్రశంసలు కురిపించాడు.
