హైదరాబాద్ : రాబోయే రోజులలో హైదరాబాద్ ను గేమింగ్, వీఎఫ్ఎక్స్ , యానిమేషన్ రంగాల హబ్ గా మారుస్తామని ప్రకటించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనపై దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌ను గేమింగ్, వీఎఫ్ఎక్స్, యానిమేషన్ పరిశ్రమలకు జాతీయ , అంతర్జాతీయ కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో డిసెంబర్‌లో జరగనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లపై సీఎస్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ ఇతర సృజనాత్మక, వినోద రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ఆకర్షించడానికి, హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. స్టోరీస్, గేమ్స్ , డ్రీమ్స్ (కథలు, ఆటలు , కలలు) అనే ఇతివృత్తంతో, యువతను ఆకట్టుకునే , స్ఫూర్తినిచ్చేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.
ఈ రంగాలలో సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి , వ్యాపార అవకాశాలను ప్రదర్శించడానికి ఒక వేదికను కల్పిస్తూ… కామిక్ కాన్ , డ్రీమ్‌హాక్ , ఇండియా గేమ్ ఉత్సవ్‌లతో పాటు బీ2బి ఎక్స్‌పో, ఇన్నోవేషన్ జోన్ , యానిమేషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే సుమారు 50 భారీ , దాదాపు 150 మధ్య తరహా యానిమేషన్ , గేమింగ్ కంపెనీలు ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించడానికి , ఈ అభివృద్ధి చెందుతున్న రంగాలలో యువతకు మెరుగైన అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు సీఎస్.
