న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు జీ మీడియా సంస్థల చైర్మన్ సుభాష్ చంద్ర. రూ. 22,006 కోట్ల క్లెయిమ్‌లకు సంబంధించి జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర సమర్పించిన రూ. 6.5 కోట్ల రుణ చెల్లింపు ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) ఆమోదం తెలిపింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ , జీ టీవీ వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర సమర్పించిన రుణ చెల్లింపు ప్రణాళికను ఆమోదించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్‌సీ కోడ్, 2016′ (IBC)లోని సెక్షన్ 114 కింద ఈ ఆమోదం లభించింది. అయితే ఆమోదం పొందని రెండు క్లెయిమ్‌లను దీని పరిధి నుండి మినహాయించారు. న్యాయపరమైన సాంకేతిక సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో మూడవ సభ్యునిగా వ్యవహరించిన జ్యుడీషియల్ సభ్యుడు నీలేష్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రుణదాతలలో అవసరమైన మెజారిటీ వర్గం ఈ ప్రణాళికను ఆమోదించిందని, మెజారిటీ అభిప్రాయం మేరకు తగిన ఉత్తర్వులు జారీ చేయడానికి ఈ విషయాన్ని ‘ఒరిజినల్ డివిజన్ బెంచ్’ ముందు ఉంచాలని శర్మ ఆదేశించారు.
రుణదాతలలో అవసరమైన మెజారిటీ వర్గం ఈ రుణ చెల్లింపు ప్రణాళికకు అనుకూలంగా ఓటు వేసింది. కొంతమంది రుణదాతలు ఈ ప్రణాళికను వ్యతిరేకించినా లేదా వ్యక్తిగత హామీదారు ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఆ కారణం చేతనే ఈ ప్రణాళిక ఆమోద యోగ్యం కాదని చెప్పలేమని శర్మ పేర్కొన్నారు. వ్యక్తిగత హామీదారుగా సుభాష్ చంద్రపై ఇన్సాల్వెన్సీ పరిష్కార ప్రక్రియను కోరుతూ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2022లో ఐబీసీలోని సెక్షన్ 95 కింద చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ ఏప్రిల్ 2024 వరకు వాయిదా పడింది. ఆ తర్వాతే పిటిషన్ స్వీకరించింది. ఆమోదించబడిన పరిష్కార ప్రణాళికను ఆలస్యంగా వచ్చిన ఇంటి కొనుగోలుదారుల క్లెయిమ్‌ల ఆధారంగా తిరిగి తెరవలేమని ఎన్సీఎల్టీ ఇండోర్ స్పష్టం చేసింది.
శివ్ నందన్ శర్మ రుణదాతల ముందు ఒక చెల్లింపు ప్రణాళికను ఉంచారు. దీని ప్రకారం ఆమోదించబడిన రూ. 22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు బదులుగా, రుణదాతలకు రూ. 6.25 కోట్లు , ప్రక్రియ ఖర్చుల కోసం రూ. 25 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారు. దాదాపు 99.9 శాతం రుణ మాఫీ (హెయిర్‌కట్) ఉన్నప్పటికీ, 80.814 శాతం ఓటింగ్ వాటా కలిగిన రుణదాతలు ఈ ప్రణాళికను ఆమోదించారు. ఆర్‌బిఎల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిబిఐ ట్రస్టీషిప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఈ ప్రణాళికను సవాలు చేస్తూ స్వతంత్ర దరఖాస్తులను దాఖలు చేయగా, ప్రతివాది నెం. 13గా చేర్చబడిన ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా అభ్యంతరాలను లేవనెత్తింది. ఎస్‌టిసిఐ ఫైనాన్స్ ఈ ప్రణాళికను విడిగా సవాలు చేసింది. ఆరోపించబడిన విధాన పరమైన అవకతవకలు, నామమాత్రపు రికవరీ , ఓటింగ్ ప్రక్రియలో అనుబంధ సంస్థలుగా ఆరోపించబడిన సంస్థలను చేర్చడం వంటి వాటికి సంబంధించిన అభ్యంతరాలు ఇవి.
జ్యుడీషియల్ సభ్యుడు ఈ ప్రణాళికను సమర్థించగా, టెక్నికల్ సభ్యుడు దానిని తిరస్కరించారు, ఫలితంగా శర్మను మూడవ సభ్యునిగా నియమించారు. డాక్టర్ చంద్ర , రుణదాతల మధ్య అర్థవంతమైన చర్చలు జరపడంలో విఫలమవడం ద్వారా, రిజల్యూషన్ ప్రొఫెషనల్ సెక్షన్ 100(2)తో సహా ఐబిసిలోని నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని ఇండస్ ఇండ్ బ్యాంక్ వాదించింది. విభేదించిన రుణదాతలు, ప్రణాళికను పరిశీలించడానికి తమకు కేవలం ఆరు రోజులు మాత్రమే గడువు ఇచ్చారని, పొడిగించిన ఓటింగ్ గడువు దీపావళి ప్రభుత్వ సెలవు దినమైన 2024 అక్టోబర్ 31న ముగిసిందని కూడా ఆరోపించారు. నోటీసు వ్యవధిని తగ్గించడానికి రుణదాతలు ఏకగ్రీవంగా అంగీకరించారని, 95 శాతానికి పైగా ఓటింగ్ వాటా ఉన్న రుణదాతలు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని పేర్కొంటూ శర్మ ఈ అభ్యంతరాన్ని తిరస్కరించారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అంగీకరించిన రూ. 1,322 కోట్ల బకాయిలకు గాను రూ. 38 లక్షలు తిరిగి చెల్లించాలనే ప్రతిపాదనను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రధాన రుణగ్రహీతలు చేసిన చెల్లింపులపై ఆధారపడటం ద్వారా వ్యక్తిగత హామీదారు తన బాధ్యతను తగ్గించుకోలేరని వాదించింది.
రుణదాతలు 2017లో ఆర్‌బిఎల్ బ్యాంకుకు 2018లో కెనరా బ్యాంకుకు సమర్పించిన నికర ఆస్తి ధృవీకరణ పత్రాలపై కూడా ఆధారపడ్డారు. ఈ పత్రాలు డాక్టర్ చంద్ర నికర ఆస్తిని వరుసగా 7.17 బిలియన్ డాలర్లు ,రూ. 40,562 కోట్లుగా చూపించాయి. వీణా ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా దాని అనుబంధ సంస్థలలో తనకు ప్రత్యక్ష వాటా లేనందున, అసోసియేట్‌లకు సంబంధించిన అభ్యంతరాలు అపోహలతో కూడుకున్నవని సుభాష్ చంద్ర వాదించారు. నికర విలువ నివేదికలు తనకు వ్యక్తిగతంగా ఉన్న ఆస్తుల ఆధారంగా కాకుండా, ప్రమోటర్ గ్రూప్ కంపెనీల ఆస్తుల ఆధారంగా రూపొందించ బడ్డాయని కూడా ఆయన సమర్పించారు. సెక్షన్ 112 కింద రిజల్యూషన్ ప్రొఫెషనల్ నివేదిక ఆధారంగా సెక్షన్ 114 ఒక రీపేమెంట్ ప్లాన్‌ను ఆమోదించడం లేదా తిరస్కరించడం అవసరమైనప్పటికీ, చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు అడ్జుడికేటింగ్ అథారిటీకి పర్యవేక్షక అధికార పరిధి ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
