హైదరాబాద్ : అంగన్‌వాడీ టీచర్లు , సహాయకులకు ప్రభుత్వం మెరుగైన పదవీ విరమణ ప్రయోజనాలను కల్పిస్తోంది. 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసే వారికి పెంచిన మొత్తంతో పాటు, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండి స్వచ్ఛందంగా విధులకు స్వస్తి పలికే వారికి కూడా ప్రభుత్వం పదవీ విరమణ ప్రయోజనాలను వర్తింప జేస్తోంది. 2023లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అంగన్‌వాడీ టీచర్లకు రూ. 1 లక్ష , అంగన్‌వాడీ సహాయకులు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 50,000 చొప్పున ప్రయోజనాలు ఉండేవి. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ప్రజా ప్రభుత్వం వీటిని మే 30, 2025న పెంచింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు ,అంగన్‌వాడీ సహాయకులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున చెల్లిస్తున్నారు.
అదేవిధంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న అంగన్‌వాడీ టీచర్లు , సహాయకులు స్వచ్ఛందంగా విధులకు స్వస్తి పలికిన సందర్భాల్లో టీచర్లకు రూ. 2 లక్షలు , సహాయకులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ‘స్వచ్ఛంద విరమణ ప్రయోజనం’ కల్పించే ఏర్పాటు చేశారు.2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,572 మంది అంగన్‌వాడీ సిబ్బంది ఖాతాల్లో పదవీ విరమణ ప్రయోజనాల కింద మొత్తం రూ. 15,61,10,000 జమ చేయబడ్డాయి. ఇందులో 473 మంది అంగన్‌వాడీ టీచర్లకు రూ. 4.73 కోట్లు , 1,930 మంది అంగన్‌వాడీ సహాయకులకు రూ. 9.65 కోట్లు చెల్లించారు. పెంచిన ప్రయోజనాల ప్రకారం, మరో 14 మంది అంగన్‌వాడీ టీచర్లకు రూ. 28 లక్షలు , 59 మంది అంగన్‌వాడీ సహాయకులకు రూ. 59 లక్షలు అందించారు. గతంలో అమలులో ఉన్న ఉత్తర్వుల కింద, మరో 96 మంది అంగన్‌వాడీ సిబ్బందికి రూ. 36.10 లక్షలు చెల్లించారు. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ సిబ్బందికి కూడా ఈ ప్రభుత్వం పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించింది.
















