హైదరాబాద్ : టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ రావడంలో ఆయన స్టైలింగ్ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. అప్పట్లో ఆయన ప్రదర్శించిన విభిన్నమైన స్టైలింగ్ అప్పటి యువతలో మంచి ఉత్సాహాన్ని నింపింది. హుడీలు ధరించడం, కార్గో ప్యాంట్లు వేసుకోవడం, లేదా ప్యాంట్లపై మరో ప్యాంట్ వేసుకోవడం వంటి వినూత్న శైలులను ఆయన ఎంతో స్టైలిష్‌గా ప్రదర్శించారు. అప్పట్లో పవన్ స్టైలింగ్ అంటేనే ఒక ట్రెండ్‌గా ఉండేది. అయితే, వీటన్నింటినీ మించి అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన అంశం ఏదైనా ఉందంటే, అది ‘బాలు’ చిత్రంలోని ఆయన ప్యాంట్లు అని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆ ప్యాంట్ల గురించి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా ప్రచారంలో సగం భాగం పవన్ ధరించిన ఆ ప్యాంట్ల చుట్టూనే తిరిగింది. చిన్న పట్టణాల్లో అయితే, ఆ ప్యాంట్ల ధర ఏకంగా 70,000 రూపాయలు ఉంటుందని కూడా పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఈ సినిమాకు మరియు పవన్ స్టైలింగ్‌కు సంబంధించి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైలింగ్‌కు సంబంధించిన బాధ్యతలన్నీ రేణు దేశాయే చూసుకునే వారనే విషయం అందరికీ తెలిసిందే. ‘బాలు’ చిత్రాన్ని చాలా భారీ స్థాయిలో ప్లాన్ చేశామని ఆమె పేర్కొన్నారు. ప్రపంచం లోనే కేవలం ఐదు మాత్రమే ఉన్న రెండో ప్రపంచ యుద్ధం నాటి వస్త్రంతో తయారు చేసిన ప్యాంట్లు అవి అని ఆమె వెల్లడించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లండన్‌లోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో ఆమె తన అప్పటి భర్త పవన్ కోసం దుస్తులు కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో కరణ్ జోహార్ కూడా షారుఖ్ ఖాన్ కోసం దుస్తులు కొనడానికి అక్కడికి వచ్చేవారని తెలిపింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ , షారుఖ్ ఖాన్ స్టైలింగ్ దాదాపు ఒకేలా ఉండేవని, దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇలా రేణు దేశాయ్ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట చర్చ నీయాంశంగా మారాయి.


















