అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఒక్కసారి కమిట్ అయ్యారంటే ఇక ఎవరి మాట వినడు. తన ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అభివృద్ది పనులపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించిన పనులు చేపట్టాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఆయన అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టారు. ఇందులో బాగంగా ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది.
రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమాన్ని చేపట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తమ గ్రామంలోని పాఠశాలకు భవనాన్ని నిర్మించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు పెదపాడు పల్లెవాసులు.
